![]() |
![]() |

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న అపూర్వ దృశ్యకావ్యం 'రామాయణ' రికార్డుల వేటను ప్రారంభించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ మేకింగ్ పరంగానే కాకుండా, బిజినెస్, మార్కెటింగ్ పరంగానూ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది.
భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పేందుకు నిర్మాతలు నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీలు ఏకంగా రూ. 4000 కోట్ల అసాధారణమైన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజ ఫ్రాంచైజీలైన మార్వెల్, డిసి, బ్యాట్‌మాన్ తరహాలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం 'సోనీ పిక్చర్స్' (Sony Pictures) భాగస్వామ్యమవ్వడం సినీ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు అనుసరించే గ్లోబల్ రిలీజ్ మోడల్‌ను 'రామాయణ' చిత్రానికి కూడా అమలు చేసేందుకు సోనీ పిక్చర్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాలు, పబ్లిసిటీ క్యాంపైన్ కోసం సోనీ పిక్చర్స్ ఏకంగా రూ. 235 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించినట్లు సమాచారం. దీనికి అదనంగా భారతీయ నిర్మాతలు మరొక రూ. 140 కోట్లు జత చేస్తుండటంతో, కేవలం ఈ సినిమా ప్రమోషన్ల కోసమే ఏకంగా రూ. 375 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో కేవలం ప్రచారానికే ఈ స్థాయిలో రూ. 375 కోట్లు వెచ్చించడం ఇదే తొలిసారి.
20కి పైగా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి కానుకగా నవంబర్ లో థియేటర్లలోకి రానుంది. ప్రపంచ ప్రేక్షకులను మైమరిపించేందుకు సిద్ధమవుతున్న ఈ పౌరాణిక చిత్రం ఇండియన్ సినిమా ఖ్యాతిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Ramayana Movie, Promotion Budget, Ranbir Kapoor, Sai Pallavi, Yash
![]() |
![]() |